Assam: కట్టుదిట్టమైన భద్రత మధ్య అసోం 'జాతీయ పౌర జాబితా' విడుదల.. 19 లక్షల మందికి షాక్!

  • 3,11,21,004 మంది భారతీయులుగా గుర్తింపు
  • జాబితా నుంచి 19,06,657 మంది తొలగింపు
  • జాబితాలో లేనివారు ట్రైబ్యునల్ ను ఆశ్రయించవచ్చు

అసోంలో స్థిరపడిపోయిన విదేశీయులను దేశం నుంచి ఏరివేసేందుకు ఉద్దేశించిన జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను ఈరోజు విడుదల చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో... ముందస్తు చర్యల్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య జాబితాను అధికారులు విడుదల చేశారు.

 ఈ ఉదయం 10 గంటలకు జాబితాను అసోంలోని అన్ని ఎన్ఆర్సీ సేవా కేంద్రాల్లో ఆన్ లైన్లో ఉంచారు. అసోంలో నివసిస్తున్నవారిలో ఎవరెవరు భారతీయులు, ఎవరెవరు విదేశీయులు అని గుర్తించేందుకు ఈ జాతీయ పౌర పట్టికను తయారు చేశారు. విదేశీయులుగా గుర్తింపబడ్డ వారు శిక్షను ఎదుర్కోవడమో లేదా వారి సొంత దేశానికి వెళ్లిపోవడమో చేయాల్సి ఉంటుంది.

ఈ జాబితా ప్రకారం అసోంలో ఉన్న 3,11,21,004 మంది భారత పౌరులుగా గుర్తింపును పొందారు. 19,06,657 మందిని జాబితా నుంచి తొలగించారు. జాబితా నుంచి తొలగించబడ్డ వారంతా విదేశీయుల కిందే లెక్క. వీరిలో సరైన గుర్తింపు పత్రాలను ఇవ్వని వారు కూడా ఉన్నారు. అయితే, జాబితా నుంచి తొలగించబడ్డ వారు విదేశీయుల ట్రైబ్యునల్ లో అప్పీల్ చేసుకోవచ్చని ఎన్ఆర్సీ స్టేట్ కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలా తెలిపారు.

గత కొంత కాలంగా ఎన్ఆర్సీ అసోంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయ రంగును కూడా పులుముకుంది. ఈ జాబితా వల్ల నిజమైన భారతీయ పౌరులు కూడా అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు, విదేశీయుల ట్రైబ్యునల్ లో న్యాయం జరగకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే సదుపాయం కూడా ఉంది. అప్పీల్ చేసుకోవడానికి గడువును 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,000 ట్రైబ్యునల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 100 ట్రైబ్యునల్స్ పని చేస్తుండగా సెప్టెంబర్ మొదటి వారంలో మరో 200 ట్రైబ్యునల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మొత్తం ట్రైబ్యునల్స్ అందుబాటులోకి రానున్నాయి.

More Telugu News