Andhra Pradesh: ఈ రాష్ట్రానికి దుర్మార్గమైన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం: అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

  • మా హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రెండు వేలు
  • ఇప్పుడు దాని ధర పది వేల రూపాయలా!
  • మిగిలిన ఎనిమిది వేలు ఏ పందికొక్కులు తింటున్నాయి

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇసుక కొరతపై శ్రీకాకుళంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నాడు టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రెండు వేలు ఉంటే, ఇప్పుడు వైసీపీ హయాంలో దాని ధర పది వేల రూపాయలు అయిందని, మిగతా ఎనిమిది వేలు ఏ పందికొక్కులు తింటున్నాయోనని మండిపడ్డారు.

‘ముఖ్యమంత్రి అంటే.. ఆలోచన ఉండాలి, సమస్యలపై అవగాహన ఉండాలి. అవగాహన, ఆలోచనలేని ఒక దుర్మార్గమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా ఒక మంచి పని ద్వారా శుభకార్యానికి శ్రీకారం చుడతారు, కానీ, ఈ ముఖ్యమంత్రి, అమరావతిలోని ప్రజావేదికను కూల్చి అశుభకార్యానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు.

‘నేను ఆరోజే అనుకున్నా. ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది. ఈ ఐదు సంవత్సరాల్లో అన్నీ అశుభాలే జరుగుతాయని అనుకున్నాను. తొంభై రోజుల్లో అవే జరుగుతున్నాయి. ఈ నాయకుడికి ముందుచూపు, అవగాహన లేవు. ఏ నిమిషానికి ఏం చేస్తాడో తెలీదు!’ అని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.

More Telugu News