Mallu Bhatti Vikramarka: అప్పులు తెచ్చి ఆస్తులు సంపాదిస్తున్నారు: కేసీఆర్ పై భట్టి విక్రమార్క విమర్శలు

  • రాష్ట్ర ఖజానాను దోపిడీ చేస్తున్న కేసీఆర్ పెద్ద సన్నాసి అంటూ వ్యాఖ్యలు
  • ప్రాజెక్టులపై ప్రజలకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్న భట్టి
  • నాలుగు నెలల్లో పాలమూరు ప్రాజెక్టు అంటూ మరో మోసానికి తెరలేపారంటూ ఆరోపణ

తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఓ ప్రమాదకరమైన వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అప్పులు తెచ్చి ఆస్తులు సంపాదించుకుంటున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర ఖజానాను దోపిడీ చేస్తున్న కేసీఆర్ పెద్ద సన్నాసి అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులపై ప్రజలకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, ఇప్పుడు 4 నెలల్లో పాలమూరు ప్రాజెక్టు అంటూ మరో మోసానికి తెరలేపారంటూ భట్టి ఆరోపణలు చేశారు.

కాళేశ్వరం పూర్తయిందంటున్న కేసీఆర్, ఆ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో చెప్పాలని నిలదీశారు. రూ.80 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరం కూడా తడవలేదని విమర్శించారు. కాళేశ్వరం బదులు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 11 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చేవని భట్టి అభిప్రాయపడ్డారు. విద్యుత్ శాఖలో అవినీతిపై రేవంత్ రెడ్డి ప్రశ్నించారని, దానికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే తప్ప ఉద్యోగులు కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

More Telugu News