Telugudesam: ఏపీలో టీడీపీ నేతల పక్క చూపులు...ఇద్దరు వైసీపీ వైపు, ఒకరు బీజేపీలోకి!

  • ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి వరుపుల గుడ్‌ బై
  • అదే మార్గంలో విశాఖ నేత ఆడారి ఆనంద్‌కుమార్‌
  • కమలదళంలో కలిసేందుకు సిద్ధమవుతున్న పంచకర్ల

తూర్పు, విశాఖ జిల్లాలకు చెందిన ముగ్గురు టీడీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ మారేందుకు దారులు వెతుక్కుంటున్నారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వరుపుల రాజా విషయంలో క్లారిటీ రాగా, విశాఖ జిల్లాకు చెందిన నేతలు ఆడారి ఆనంద్‌కుమార్‌, పంచకర్ల రమేష్‌బాబు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. విశాఖ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు టీడీపీని వీడితే పార్టీకి గణనీయమైన నష్టమే. విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ గత ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి  లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే పంచకర్ల రమేష్‌బాబు యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు చెరో పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లా రైతుల్లో ఆడారి తులసీరావుకు మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో డెయిరీ పాలకవర్గంపై అధికార పార్టీ దృష్టిసారించడంతో ఆనంద్‌ పార్టీ మారే యోచన చేస్తున్నారని తెలుస్తోంది. సోదరుడి బాటలోనే తులసీరావు కుమార్తె, ఎలమంచిలి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సెప్టెంబర్‌ 1న విజయవాడలో జగన్‌ సమక్షంలో వీరు వైసీపీలో చేరుతారని భోగట్టా. ఇక, పంచకర్ల రమేష్‌బాబు బీజేపీలోకి వెళ్లిపోతే భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో ఉన్న నేతలతో తనకు పరిచయం ఉన్న వారి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

మరోవైపు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, గత ఎన్నికల్లో పత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిన వరుపుల రాజా ఇప్పటికే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అదే సమయంలో ఆయన వైసీపీ అధినేత జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించడంతో ఆయన వైసీపీలో చేరుతారన్న విషయం స్పష్టమైపోయింది.

More Telugu News