Jammu And Kashmir: కశ్మీరీ అక్కాచెల్లెళ్లను పెళ్లాడి చిక్కుల్లో పడిన బీహార్ అన్నదమ్ములు!

  • నాలుగేళ్లుగా కశ్మీరులో నివసిస్తున్న బీహార్ సోదరులు
  • కశ్మీరీ అమ్మాయిల ప్రేమలో పడి డేటింగ్
  • ఆర్టికల్ 370 రద్దుతో పెళ్లి చేసుకుని ఒక్కటైన జంటలు

కశ్మీర్‌లో వలస కార్మికులుగా పనిచేస్తూ కశ్మీరీ అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన ఇద్దరు బీహారీ సోదరులు తీవ్ర చిక్కుల్లో పడ్డారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిబంధనలు మారిపోవడంతో సోదరులిద్దరూ వారిని పెళ్లాడారు. అనంతరం సుపౌల్‌లోని తమ ఇంటికి తీసుకొచ్చారు. కశ్మీరీ అమ్మాయిలను పెళ్లాడిన విషయం ఒక్కసారిగా వైరల్ అయింది. జాతీయ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.

అయితే, బుధవారం ఒక్కసారిగా బీహార్ సోదరుల పరిస్థితి మారిపోయింది. ఆ అమ్మాయిలను పెళ్లాడిన మొహమ్మద్ తబ్రేజ్ (26), మొహమ్మద్ పర్వేజ్ (24)ను కశ్మీర్ పోలీసులు బీహార్‌లోని వారింటికి వెళ్లి అరెస్ట్ చేశారు. మేజర్లే అయిన వారిద్దరినీ బీహార్ యువకులు కిడ్నాప్ చేశారన్న యువతుల తండ్రి ఫిర్యాదుపై పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

అనంతరం యువతులు, యువకులను సుపౌల్ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం యువతుల స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేశారు. తాము మేజర్లమేనని, తమ ఇష్టపూర్వకంగానే వారిని పెళ్లాడామని యువతులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. తమను వదిలిపెడితే భర్తలతో కలిసి జీవిస్తామని వేడుకున్నారు. అయితే, కోర్టు మాత్రం వారిని ట్రాన్సిట్ రిమాండ్‌పై తీసుకెళ్లేందుకు కశ్మీర్ పోలీసులకు అనుమతిచ్చింది.

నాలుగేళ్లుగా కశ్మీర్‌లో కార్మికులుగా పనిచేస్తున్న సోదరులిద్దరూ యువతులతో ప్రేమలో పడ్డారు. అనంతరం వారితో డేటింగ్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అడ్డంకులు తొలగిపోవడంతో వారిని వివాహం చేసుకున్నారు.

More Telugu News