Actress: కశ్మీర్‌లో ఉంటున్న అత్తమామల పరిస్థితిపై నటి ఊర్మిళ ఆందోళన

  • వారితో మాట్లాడేందుకు 22 రోజులుగా ప్రయత్నిస్తున్నామన్న ఊర్మిళ
  • ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీల జీవితాలు బాగుపడితే మంచిదేనని వ్యాఖ్య
  • రద్దు చేసిన విధానమే బాగోలేదన్న కాంగ్రెస్ నేత

జమ్మూకశ్మీర్ పరిస్థితులపై బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మదోండ్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో నివసిస్తున్న అత్తమామలు ఎలా ఉన్నారోనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరూ మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వారితో మాట్లాడాలని ఇప్పటికి 22 రోజులుగా తన భర్త ప్రయత్నిస్తూనే ఉన్నారని, కానీ ఫలితం లేకుండా పోతోందని విచారం వ్యక్తం చేశారు.

వారి దగ్గర తగినన్ని మందులు ఉన్నాయో, లేవో కూడా తమకు తెలియదని ఊర్మిళ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌తో కలిసి గురువారం నాందేడ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఊర్మిళ ఆర్టికల్ 370 రద్దుపై అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ ప్రజల జీవితాలు బాగుపడితే, అభివృద్ధి జరిగితే మంచిదేనన్న ఊర్మిళ.. ఆర్టికల్ 370ని రద్దు చేసిన విధానమే బాగోలేదన్నారు.

కశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త, మోడల్ అయిన మోసిన్ అఖ్తర్ మిర్‌ను ఊర్మిళ పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మొదట్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబై (నార్త్) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఊర్మిళ పరాజయం పాలయ్యారు.

More Telugu News