Modi: 60 ఏళ్ల వయసులో రావాల్సిన హార్ట్ అటాక్ ఇప్పుడు 30 ఏళ్లకే వచ్చేస్తోంది.. మనం మారాలి: మోదీ పిలుపు

  • ఫిట్ గా ఉన్న వారికి ఆకాశమే హద్దు
  • ఫిట్ నెస్ ప్రతి భారతీయుడికి జీవిత మంత్రం కావాలి
  • టెక్నాలజీ యుగంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది

ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 'ఫిట్ ఇండియా మూమెంట్'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, సెలబ్రిటీలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, విజయానికి ఎలివేటర్ ఉండదని, మెట్లెక్కి విజయాన్ని చేరుకోవాల్సిందేనని చెప్పారు. మెట్టు ఎక్కాలంటే ఫిట్ నెస్ ఉండాలని అన్నారు. బాలీవుడ్ కానీ, బోర్డ్ రూమ్ కానీ ఎక్కడైనా సరే.. ఫిట్ గా ఉన్నవారికి ఆకాశమే హద్దు అని చెప్పారు. బాడీ ఫిట్ గా ఉంటే... మైండ్ హిట్ కొడుతుందని అన్నారు.

ఫిట్ నెస్ తో కూడిన ఇండియా కోసం ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని... స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ తరహాలో ఈ ఉద్యమంను కూడా విజయవంతం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఫిట్ నెస్ అనేది ప్రతి భారతీయుడి జీవిత మంత్రం కావాలని అన్నారు. టెక్నాలజీ మన జీవన విధానాన్ని మార్చి వేసిందని చెప్పారు. కొన్ని దశాబ్దాల క్రితం ప్రతి వ్యక్తి ప్రతి రోజు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం నడవడమో, సైకిల్ తొక్కడమో లేక పరిగెత్తడమో చేసేవారని... కానీ ఈ టెక్నాలజీ యుగంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు.

ఫిట్ నెస్ గురించి, డైటింగ్ గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు కూడా డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చేసరికి మరో విధంగా వ్యవహరిస్తున్నారని మోదీ చమత్కరించారు. గతంలో 60 ఏళ్ల వయసులో ఉన్నవారికి హార్ట్ అటాక్స్ వచ్చేవని... ఇప్పుడు 30, 40 ఏళ్లకే వచ్చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవన విధానం మార్పు కారణంగా రోగాలు, రుగ్మతల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. మన జీవన విధానంలో మనం తీసుకునే చిన్న మార్పు... పరిస్థితిని సమూలంగా మార్చి వేస్తుందని హితవు పలికారు.

More Telugu News