motor vehicle act: గుబులు పుట్టిస్తున్న కొత్త వాహన చట్టం.. నాలుగేళ్లు దాటితే పిల్లలూ హెల్మెట్ ధరించాల్సిందే!

  • మరో మూడు రోజుల్లో అమల్లోకి రానున్న కొత్త చట్టం
  • లోడు సామర్థ్యానికి మించితే రూ. 20 వేల జరిమానా
  • సీటు బెల్టు ధరించకుంటే వెయ్యి

వాహనదారుల్లో కొత్త వాహన చట్టం గుబులు పుట్టిస్తోంది. వచ్చే నెల ఒకటి నుంచి గీత దాటితే వేటు తప్పేలా కనిపించడం లేదు. మోటారు వాహనాల సవరణ చట్టం-2019లోని 28 నిబంధనలు ఒకటో తేదీ నుంచి అమలు కానున్న నేపథ్యంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మిగతా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించనున్న ప్రభుత్వం పిల్లల విషయంలోనూ అంతే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

ఇకపై, బైక్‌పై తల్లిదండ్రులతో కలిసి వెళ్లే నాలుగేళ్ల చిన్నారులు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందేనని సవరణ చట్టం చెబుతోంది. లేదంటే భారీ జరిమానా తప్పదు. ఇక, ఇప్పటి వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలకు వందల్లో ఉన్న జరిమానా మరో మూడు రోజుల తర్వాత వేలల్లోకి మారుతుంది. అంతేకాదు, దీనికి జైలు శిక్ష అదనం. సామర్థ్యానికి మించిన లోడుతో వెళ్తే రూ.20 వేల వరకు జరిమానాతోపాటు అదనంగా ఉండే ప్రతీ టన్నుకు మరో రూ.2 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అక్కడితో కథ ముగిసిపోదు. జరిమానా చెల్లించినా, అదనపు బరువును అక్కడికక్కడే తగ్గించాల్సి ఉంటుంది.

అలాగే, ప్రయాణికుల వాహనాల విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తే జేబులు గుల్ల చేసుకోకతప్పదు. నిర్ణీత సంఖ్యకు మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 చొప్పున వసూలు చేస్తారు. సీటు బెల్టు ధరించకుంటే వెయ్యి రూపాయలు చెల్లించుకోక తప్పదు. సో.. వాహనదారుల్లారా.. తస్మాత్ జాగ్రత్త!  

More Telugu News