kannan gopinathan: వెంటనే విధుల్లో చేరండి: కశ్మీర్‌పై మాట్లాడే స్వేచ్ఛ లేదని ఉద్యోగాన్ని వదిలేసిన ఐఏఎస్ అధికారికి ఆదేశాలు

  • స్వేచ్ఛలేని ఉద్యోగం తనకొద్దంటూ రాజీనామా
  • ఈ నెల 21న హోం మంత్రిత్వ శాఖకు లేఖ
  • రాజీనామాను ఆమోదించే వరకు విధుల్లో కొనసాగాలని ఆదేశాలు

జమ్మూకశ్మీర్‌పై మాట్లాడే స్వేచ్ఛలేని ఉద్యోగం తనకొద్దంటూ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. తనను విధుల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా కోరుతూ ఇటీవల ఆయన హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఆయన లేఖకు తాజాగా ఉన్నతాధికారులు స్పందించారు. రాజీనామాను ఆమోదించే వరకు విధుల్లో కొనసాగాలని, వెంటనే డ్యూటీలో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.

కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్, డయ్యు, దాదర్, నాగర్ హవేలీకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కన్నన్.. తనను విధుల నుంచి రిలీవ్ చేయాలంటూ ఈ నెల 21న హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కన్నన్ విధులకు దూరంగా ఉండడంపై  తాజాగా డామన్ డయ్యు పర్సనల్ డిపార్ట్‌మెంట్ స్పందించింది. రాజీనామాను ఆమోదించే వరకు విధులకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు పర్సనల్ డిపార్ట్‌మెంట్  డిప్యూటీ సెక్రటరీ గురుప్రీత్ సింగ్ ఈ నెల 27న ఆదేశించారు.

కన్నన్ సిల్వస్సాలో లేకపోవడంతో నోటీసు ప్రతిని ఆయన నివాసముండే ప్రభుత్వ గెస్ట్‌హౌస్ గది తలుపుపై అతికించారు. డ్యూటీలో చేరాలన్న ఆదేశాలపై కన్నన్ మాట్లాడుతూ.. ఆదేశాలు వచ్చిన మాట నిజమేనని, అయితే, ఈ విషయంలో ఎటువంటి కామెంట్ చేయలేనని పేర్కొన్నారు.

More Telugu News