Kalava: రాజధానిపై స్పష్టత ఇచ్చేందుకు జగన్ కు ఎందుకు మనసు రావడంలేదు?: కాలవ శ్రీనివాసులు

  • రాజధానిపై ప్రభుత్వ ప్రకటనలను వైసీపీ తప్ప అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్న కాలవ  
  • వైసీపీ నేతల వ్యాఖ్యల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయంటూ ఆరోపణ
  • బొత్స రోజుకో అసత్యం జోడించి ఆజ్యం పోస్తున్నారంటూ ఆగ్రహం

ఏపీ రాజధాని అమరావతిపై నెలకొన్న అనిశ్చితి విషయంలో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు అమరావతిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాజధాని విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో సీఎం జగన్ ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదని ప్రశ్నించారు. రాజధానిపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రికి ఎందుకు మనసు రావడంలేదని అడిగారు.

ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏ అంశంపైనా ప్రభుత్వానికి స్పష్టత లేదన్న విషయం తెలుస్తోందని అన్నారు. రాజధానిపై ప్రభుత్వ ప్రకటనలను వైసీపీ తప్ప అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని కాలవ స్పష్టం చేశారు. బొత్స ఈ వివాదానికి రోజుకో అసత్యం జోడించి మరింతగా ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు (చిన్నల్లుడు భరత్ తండ్రి ఎంఎస్ బీ రామారావు)పైనా బొత్స అసత్య ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలకు చంద్రబాబును జవాబు చెప్పమంటున్నారని వ్యాఖ్యానించారు.

కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో భూములు ఇస్తే టీడీపీ హయాంలో ఇచ్చారని అబద్ధాలు చెప్పారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.

More Telugu News