cm: ఇప్పుడు రాష్ట్రమంతా ఈ సెక్షన్ అమలు చేస్తున్నారుగా!: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్

  • ఇన్నిరోజులూ సీఎం జగన్ ఇంటి దగ్గరే 144 సెక్షన్ ఉంది
  • ఆశా కార్యకర్తలు, విద్యార్థులపై కర్కశంగా వ్యవహరిస్తారా?
  • ఇలాంటి ప్రభుత్వాన్ని దేశం తొలిసారిగా చూస్తోంది

ఏపీ సీఎం జగన్ పై, ప్రభుత్వం తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. వరదలొచ్చి ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రిగా ఆదుకోవాల్సిన సమయంలో జగన్ అమెరికా వెళ్ళొచ్చారని విమర్శించారు. ఈరోజు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు ఇవ్వమని అడిగిన విద్యార్థులను పోలీసుల బూటుకాళ్ళతో తన్నిస్తారా? వీళ్ళకు చదువులు వద్దా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘మేము మీకు అన్యాయం చేస్తాం. మీరు మాత్రం ఆందోళన చేయడానికి వీల్లేదు’ అనే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య చరిత్రలో దేశం తొలిసారిగా చూస్తోందని విమర్శించారు. ఆశాకార్యకర్తలు ఆందోళనచేస్తే వాళ్ళ కుటుంబసభ్యులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి బెదిరిస్తారా? ఇప్పుడు విద్యార్థుల పట్ల ఇలా కర్కశంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. ఇన్నిరోజులూ సీఎం జగన్ ఇంటి దగ్గరే 144 సెక్షన్ ఉందని అనుకున్నామని, ఇప్పుడు రాష్ట్రమంతా ఈ సెక్షన్ అమలు చేస్తున్నారుగా! అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని, వారికి న్యాయం జరిగే వరకూ తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

More Telugu News