Statue Of Unity: ప్రఖ్యాత 'టైమ్' మ్యాగజైన్ లో గుజరాత్ 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'కి స్థానం

  • ప్రపంచవ్యాప్తంగా 100 నూతన దర్శనీయ స్థలాలతో 'టైమ్' మ్యాగజైన్ జాబితా
  • వాటిలో 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'కి స్థానం
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా వల్లభాయ్ పటేల్ విగ్రహం ఘనత

  భారత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మహోన్నత విగ్రహానికి ప్రపంచ ప్రఖ్యాత 'టైమ్' మ్యాగజైన్ సముచిత స్థానం కల్పించింది. 'టైమ్' మ్యాగజైన్ 'ప్రపంచ మహోన్నత సందర్శనీయ స్థలాలు-2019' పేరిట ఓ జాబితా రూపొందించింది. అనేక దేశాల్లో నూతనంగా ఏర్పాటైన 100 గొప్ప ప్రదేశాలతో ఈ జాబితా రూపొందించారు. వాటిలో గుజరాత్ లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'కి కూడా స్థానం కల్పించారు.

కొన్నాళ్ల కిందట ప్రారంభమైన ఈ 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా పేరుగాంచింది. దీని ఎత్తు 182 మీటర్లు. నర్మదా నది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యామ్ కు అభిముఖంగా నిర్మించారు. కాగా, 'టైమ్' మ్యాగజైన్ లో వల్లభాయ్ పటేల్ విగ్రహానికి చోటు కల్పించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. ఇదో అద్భుతమైన వార్త అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు.

More Telugu News