Crime News: పోలీస్ చెకింగ్ వుండదని.. ఏకంగా వాహనానికి పోలీస్‌ స్టిక్కరంటించి దొరికిపోయాడు!

  • తనిఖీల్లో చిక్కడంతో బిక్కమొహం వేసిన వైనం
  • నంబర్‌ ప్లేట్‌ కూడా మార్చినట్లు గుర్తించిన పోలీసులు
  • యువకుడిపై కేసు నమోదు

నగరంలో ఎక్కడికెళ్లినా పోలీసుల తనిఖీలు...అవీ, ఇవీ చూపాలంటూ ఒత్తిడి...సవాలక్ష ప్రశ్నలు. ఈ తల నొప్పి ఉండకూడదంటే..ఆ యువకుడికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే తన హోండా కారుకి ఏకంగా పోలీస్‌ స్టిక్కర్‌ అంటించేశాడు. అంతేకాదు, నంబర్‌ ప్లేట్‌ వల్ల దొరికిపోయే ప్రమాదం వుందని భావించి, పోలీసు వాహనాలకు కేటాయించే నంబర్‌కు దగ్గరగా ఉండే నంబర్‌ ప్లేట్‌ను తయారు చేయించి మార్చేశాడు. కొన్నాళ్లు దర్జాగా తిరగగలిగినా పూర్తికాలం అతని ఎత్తుగడ ఫలించలేదు. పోలీసుల తనిఖీల్లో గుట్టు రట్టుకావడంతో కేసు ఎదుర్కొంటున్నాడు.

పోలీసుల కథనం మేరకు...హైదరాబాద్, బంజారాహిల్స్‌ పోలీసులు తనిఖీ చేస్తుండగా  ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని ఆపి దగ్గరకు వెళ్లి గమనిస్తే అద్దంపై పోలీస్‌ స్టిక్కర్‌ ఉంది.  దీంతో ఏ అధికారిదా కారు? అని పోలీసు డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్న ప్రదీప్‌ అనే యువకుడిని ప్రశ్నించారు. అతను తడబాటు చెందడంతో అనుమానం వచ్చి పత్రాలు తనిఖీ చేస్తే అది పోలీసు అధికారి కారు కాదని తేలింది. ఎందుకలా చేశావంటే సరదా కోసం చేశానని ప్రదీప్‌ చెప్పడంతో ఆశ్చర్యపోయారు. నంబర్‌ ప్లేట్లు కూడా మార్చి పోలీసులకు సాధారణంగా కేటాయించే సీరియల్‌లోని ఫ్యాన్సీ నంబర్‌ పెట్టాడని గుర్తించారు. దీంతో కారు స్వాధీనం చేసుకుని ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.

More Telugu News