jagityala: బతికుండగానే తల్లిని కాటికి పంపిన యమ‘ధర్మ’రాజు!

  • అనారోగ్యంతో బాధపడుతుండడంతో ముందే చితి పేర్చిన ఘనుడు
  • అద్దె ఇంట్లో చనిపోతే మాట పడాల్సి వస్తుందని నిర్వాకం
  • ఆదుకున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది

పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడు అన్నారు పెద్దలు. ఇది ఎంత నిజమో తెలియకున్నా బతికుండగానే కన్నతల్లికి చితి సిద్ధం చేశాడో కొడుకు. తల్లి చనిపోతే అద్దె ఇంటి యజమానితో మాటపడాల్సి వస్తుందని ముందుగానే శ్మశానానికి తరలించి చేతులు దులుపుకున్నాడు.

చూసేవాళ్లు, వినేవాళ్లు ‘అయ్యో...పాపం’ అని ముక్కున వేలేసుకుంటున్న ఈ అమానవీయ సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...జగిత్యాల వీక్లీ బజార్‌కు చెందిన చెట్‌పల్లి నర్సమ్మ (95) భర్త 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. ప్రస్తుతం ఆమె కొడుకు ధర్మయ్య వద్ద ఉంటోంది.

ధర్మయ్య కుటుంబం అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఇటీవల నర్సమ్మ తీవ్ర అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె చనిపోతుందేమోనని, ఒకవేళ అదే జరిగితే అద్దె ఇంట్లో జరగడం వల్ల దాని యజమానితో మాటపడాల్సి వస్తుందని ధర్మయ్య ఆందోళన చెందాడు. ఆమె కన్ను మూయక ముందే కనికరం లేకుండా తల్లిని జగిత్యాలలోని ఓ శ్మశాన వాటికకు తరలించాడు. అక్కడ ఉన్న ఓ గదిలో ఆమెను పడేశాడు.

వృద్ధురాలి దీన స్థితి చూసి  చలించిపోయిన స్థానికులు కొందరు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు సుదక్షిణాదేవికి సమాచారం అందించారు. దీంతో వెంటనే ఆమె అంబులెన్స్‌ పంపించి నర్సమ్మను ఆసుపత్రికి రప్పించారు. ప్రస్తుతం నర్సమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

More Telugu News