Dil Raju: ఏదైనా తేడా వస్తే నిర్మాతలు అడ్డంగా నష్టపోతారు: దిల్ రాజు

  • పెద్ద సినిమాల మధ్య గ్యాప్ ఉండాలి
  • 'వాల్మీకి' విడుదల వారం రోజులు వాయిదా
  • అంగీకరించిన నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పిన దిల్ రాజు

ఎంతో కష్టపడి సినిమాలను నిర్మించే నిర్మాతలు, తమ చిత్రాలు పండగ సందర్భంగా విడుదల చేయాలని అనుకోవడంలో తప్పు లేదని, అయితే పెద్ద హీరోల చిత్రాలు ఒకేసారి విడుదలై, ఏదైనా తేడా వస్తే, అడ్డంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, సెలవులు లేని రోజుల్లో వారానికి ఒకరు తమ సినిమాలను విడుదల చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా విడుదల కానున్న 'సాహో', 'సైరా' వంటి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

ఈ రెండు సినిమాలు క్లాష్ అయితే, నిర్మాతలు తీవ్రంగా నష్టపోయి ఉండేవారని అభిప్రాయపడ్డ దిల్ రాజు, నాని నటించిన 'నానీస్ గ్యాంగ్ లీడర్', వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'వాల్మీకి' చిత్రాల విషయంలో ఇటువంటి సమస్యే ఏర్పడగా, నిర్మాతల గిల్డ్ సమస్యను పరిష్కరించిందన్నారు. ఈ రెండు సినిమాలూ సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధం అయ్యాయని, ప్రోడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలను పిలిచి మాట్లాడటంతో, 'వాల్మీకి' విడుదలను వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకునేందుకు అంగీకరించిన నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంటలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి పరిస్థితి వస్తే సామరస్యంగానే ముందుకు సాగాలని సూచించారు.

More Telugu News