తనను ఇబ్బంది పెట్టిన భారత టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నాగల్ పై ఫెదరర్ ప్రశంసలు

27-08-2019 Tue 21:21
  • యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ లో చెమటోడ్చి నెగ్గిన ఫెదరర్
  • నాగల్ పై నాలుగు సెట్ల పాటు పోరు
  • నాగల్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందంటూ కితాబు
యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడం ద్వారా సంచలనం సృష్టించిన భారత టెన్నిస్ ఆశాకిరణం సుమీత్ నాగల్ తొలి మ్యాచ్ లో రోజర్ ఫెదరర్ అంతటి దిగ్గజాన్ని సైతం రెండు గంటలు పైగా కోర్టులో కలియదిప్పాడు. ఈ మ్యాచ్ లో నాగల్ ఓడిపోయినా ఫెదరర్ ప్రశంసలను అందుకున్నాడు. 2 గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో నాగల్ 6-4, 1-6, 2-6, 4-6 తో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్ గెలిచిన నాగల్ ఆపై ఫెదరర్ అనుభవం ముందు తలవంచాడు. అయినప్పటికీ తన ప్రతిభతో స్విస్ స్టార్ ను ఆకట్టుకున్నాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఫెదరర్ మాట్లాడుతూ, నాగల్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డాడు. తన సత్తా ఏంటో తాను తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఈ విషయంలో నాగల్ ఫర్వాలేదని తెలిపాడు. నాగల్ చాలా స్థిరమైన ఆటతీరు కనబర్చాడని, అయితే ఈ మ్యాచ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదని ఫెదరర్ తెలిపాడు.