Arvind Kejriwal: కేజ్రీవాల్ దూకుడు.. ఢిల్లీ ప్రజలకు మరో తీపి కబురు!

  • సమీపిస్తున్న ఎన్నికలు
  • వరుసపెట్టి సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్న కేజ్రీవాల్
  • తాజా ప్రకటనతో 13 లక్షల కుటుంబాలకు లబ్ధి

సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు మరో తీపి కబురు చెప్పారు. ఇటీవల ఢిల్లీ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల సీబీఎస్‌ఈ పరీక్ష ఫీజులను రీయింబర్స్‌మెంట్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా ఢిల్లీ జలమండలి పరిధిలోని నీటి మీటర్లు ఉన్న గృహ వినియోగదారులందరికీ నీటి పన్ను బకాయిలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నవంబరు 30 వరకు ఈ పథకం ఉంటుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు, నీటి మీటర్ల వినియోగం పెరిగి ప్రభుత్వానికి రూ.600 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా. ఈ పథకంలో చేరాలనుకునేవారు తమ ఇంటి వద్ద మీటర్లు బిగించుకోవాలని సూచించారు. కాగా, కేజ్రీవాల్ ప్రభుత్వం ఇటీవల 200 యూనిట్ల లోపు వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్టు ప్రకటించింది.

అలాగే, మెట్రో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మెట్రోల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు ప్రకటించినా ఆ పథకం ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఏమైనా, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలను వరుసపెట్టి ప్రకటిస్తోంది.

More Telugu News