Dinesh Chawla: ఎంతో పేరున్న సీఈవో దొంగగా మారాడు... అసలు కారణం ఏమిటంటే..!

  • ఎయిర్ పోర్టులో చోరీకి పాల్పడిన చావ్లా హోటల్స్ సీఈవో దినేశ్ చావ్లా
  • బ్యాగేజ్ కౌంటర్ నుంచి సూట్ కేస్ తస్కరించిన చావ్లా
  • థ్రిల్ కోసమే దొంగగా మారానంటూ వెల్లడి
  • అవాక్కయిన పోలీసులు!

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి  అని పెద్దలు ఊరికే అనలేదు! అమెరికాలో ఎంతో పేరున్న చావ్లా హోటల్స్ సీఈఓ దినేశ్ చావ్లాకు ఈ నానుడి బాగా వర్తిస్తుంది. సీఈవో అంటే ఓ సంస్థలో అత్యున్నత స్థాయి అధికారి. కోట్లలో వేతనం ఉంటుంది. అలాంటి వ్యక్తి చోరీ చేశాడంటే నమ్మగలమా? కానీ దినేశ్ చావ్లా మాత్రం మెంఫిస్ ఎయిర్ పోర్టులోని లగేజ్ కౌంటర్ నుంచి ఓ సూట్ కేస్ తస్కరించి తన కారులో పెట్టేసుకున్నారు. మళ్లీ ఎయిర్ పోర్టులో ప్రవేశించి తాను వెళ్లాల్సిన గమ్యస్థానానికి విమానంలో వెళ్లిపోయారు.

అయితే ఆ సూట్ కేస్ సొంతదారు ఫిర్యాదు చేయడంతో చావ్లా ఘనకార్యం వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన ఎయిర్ పోర్టు అధికారులు దినేశ్ చావ్లానే ఆ సూట్ కేస్ ను ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. తనిఖీలు నిర్వహించగా, మరో ఆసక్తి కలిగించే విషయం కూడా తెలిసింది. కిందటి నెలలో చోరీకి గురైన ఓ బ్యాగ్ కూడా చావ్లా కారులో దొరికింది. దినేశ్ చావ్లా తిరిగి మెంఫిస్ రాగానే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆయన చెప్పిన సమాధానంతో వారికి మతిపోయింది.

తాను సరదా కోసమే దొంగతనాలు చేస్తున్నానని వెల్లడించారు. చోరీలు చేయడం సరైన పని కాదని తనకూ తెలుసని, కానీ, మజా కోసం ఇలా చేయక తప్పడంలేదని తాపీగా సమాధానమిచ్చారు. ఆయన సమాధానాలతో అవాక్కయిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దినేశ్ చావ్లా ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిజినెస్ పార్ట్ నర్! ట్రంప్ కుటుంబానికి ఉన్న కొన్ని వ్యాపారాల్లో చావ్లా కూడా భాగస్వామిగా ఉండేవాడు.

More Telugu News