Kanna: మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్ పనులన్నీ తిరోగమనంలో ఉన్నాయి: కన్నా లక్ష్మీనారాయణ

  • ఏపీ రాజధాని అమరావతే అని గతంలో జగన్ చెప్పారు
  • ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారు
  • అమరావతిపై జగన్ స్పష్టతను ఇవ్వాలి

రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిని చేసిందని... అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న తాను కూడా అమరావతికి మద్దతు పలికానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారని అన్నారు.

అయితే, మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పిన వైసీపీ అధినేత... వారి మాటలకు పూర్తి విరుద్ధంగా వెళుతున్నారని విమర్శించారు. గత నాలుగు నెలలను పరిశీలిస్తే వైసీపీ ప్రభుత్వ తీరు ఒకడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కన్నాతో పాటు పలువురు బీజేపీ నేతలు నేడు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నా మాట్లాడుతూ, ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

అన్ని విషయాల్లో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటోందని కన్నా దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఆత్రం ఎక్కువ, పని తక్కువ అనే విషయం స్పష్టంగా కనపడుతోందని అన్నారు. అధికారంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి... ప్రతిపక్షంలో ఉన్నామనే భావనతోనే మాట్లాడుతున్నారని చెప్పారు. అన్ని పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని... అయితే, అవినీతి ఎక్కడ జరిగిందో, ఎవరు చేశారో అనే విషయాన్ని మాత్రం వెల్లడించరని అన్నారు. అవినీతి జరిగితే దాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వివరాలను బయటకు చెప్పకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.  

ప్రజావేదికను కూల్చాలనుకున్నప్పుడు కూడా వద్దని తాను చెప్పానని... అయితే, ఏకపక్ష నిర్ణయాలతో దాన్ని కూల్చివేశారని... అదంతా ఎవరి సొమ్ము అని కన్నా ప్రశ్నించారు. ఆ సొమ్ము నీది కాదు, చంద్రబాబుది కాదని... అది ప్రజల సొమ్ము అని జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న వారంతా ప్రజాధనానికి రక్షకులే కానీ, యజమానులు కాదని అన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోమని మీకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టలేదని మండిపడ్డారు. ప్రజల అభీష్టం మేరకు పని చేస్తేనే వారు మళ్లీ ఓటు వేస్తారని చెప్పారు.  అంతా నా సొంతం అనుకుంటే కుదరదని... ఏదీ నీ సొంతం కాదని అన్నారు. నా సొంతం అనుకున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని... రేపు నీకు కూడా అదే విధంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీ ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి ఉంటుందని హితవు పలికారు.

అమరావతి విషయంలో పార్టీ నేతల చేత ముందస్తుగా ప్రకటనలు చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ముందుకు వచ్చి... ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను రోడ్లెక్కేలా చేయడం బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి సరికాదని అన్నారు. రాజధానిని ఇక్కడ నుంచి మార్చమనే విషయాన్ని జగన్ స్పష్టం చేయాలని చెప్పారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.

More Telugu News