Kanchan Chaudhary Bhattacharya: భారత తొలి మహిళా డీజీపీ కాంచన్ కన్నుమూత

  • 2004లో ఉత్తరాఖండ్ డీజీపీగా పదవీబాధ్యతలు
  • 2007లో రిటైరైన కాంచన్
  • 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆప్ తరపున పోటీ

మన దేశంలో తొలి మహిళా డీజీపీగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన కాంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ముంబైలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాంచన్ 1973 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి. 2004లో ఉత్తరాఖండ్ డీజీపీగా పదవీబాధ్యతలను చేపట్టి చరిత్ర సృష్టించారు. 2007 అక్టోబర్ 31న ఆమె రిటైర్ అయ్యారు.

రిటైర్మెంట్ తర్మాత కాంచన్ రాజకీయరంగంలో అడుగుపెట్టారు. హరిద్వార్ నియోజకవర్గం నుంచి 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు.

కాంచన్ మృతి నేపథ్యంలో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశ తొలి మహిళా డీజీపీ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రజా జీవితంలోనే ఉండాలని... చివరి శ్వాస వరకు దేశానికి సేవ చేయాలని ఆమె తపించారని అన్నారు. ఆమె మరణం తీరని లోటు అని ట్వీట్ చేశారు.

ఉత్తరాఖండ్ పోలీసులు కూడా కాంచన్ మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప నాయకత్వ లక్షణాలతో పాటు, మంచి హృదయం ఉన్న గొప్ప అధికారి ఆమె అని గుర్తు చేసుకున్నారు. అత్యున్నత కెరీర్ ఆమె సొంతమని, తన పని తీరుతో ఎన్నో అవార్డులను స్వీకరించారని తెలిపారు. దేశంలో తొలి మహిళా డీజీపీ, రెండో మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అయిన కాంచన్ మరణం తమను ఎంతో ఆవేదనకు గురి చేస్తోందని ట్వీట్ చేశారు.

More Telugu News