థియేటర్లకు అనుమతి లేకుండా ఏళ్లుగా నడుస్తున్న పంజాగుట్ట పీవీఆర్... షాకిచ్చిన జీహెచ్ఎంసీ!

27-08-2019 Tue 07:39
  • ట్రేడ్ లైసెన్స్ లేకుండానే థియేటర్ల నిర్వహణ
  • తనిఖీల్లో బట్టబయలు
  • 48 గంటల గడువిచ్చిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్, పంజాగుట్టలోని పీవీఆర్ మల్టీప్లెక్స్... ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఈ మూవీ థియేటర్ కాంప్లెక్స్ కు ఇప్పటి వరకూ ట్రేడ్‌ లైసెన్స్‌ లేకపోవడం గమనార్హం. దీన్ని పసిగట్టిన జీహెచ్‌ఎంసీ, నోటీసులు జారీ చేయడంతో పాటు, రెండు రోజుల్లోగా, అవసరమైన పత్రాలన్నీ అందించి, వ్యాపార లైసెన్స్‌ తీసుకోవాలని, లేకపోతే, థియేటర్లను మూసివేస్తామని నోటీసులు ఇచ్చారు.

నిన్న ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ ఫారుఖీ, ఉప కమిషనర్‌ గీతారాధిక, టౌన్‌ ప్లానింగ్‌ సీపీ భవాని తదితర అధికారులు, పీవీఆర్ లో తనిఖీలు చేపట్టగా, అసలు వాణిజ్య అనుమతులే లేవని తేలింది. భవన నిర్మాణ ప్లాన్‌, కట్టడం సరిగ్గా ఉందా? లేదా? తదితర విషయాలపై ఆరా తీసిన అధికారులు, నిర్మాణం బాగానే ఉందని తేల్చారు. థియేటర్‌ నిర్వహణ కోసం లైసెన్స్‌ లేదని తెలుసుకుని నోటీసులు ఇచ్చామని అధికారులు వెల్లడించారు.