Gali Janardhan Reddy: నాగ మారుతీ శర్మ సాక్ష్యంతో అడ్డంగా ఇరుక్కున్న గాలి జనార్దన్ రెడ్డి!

  • గాలి బెయిల్ డీల్ కేసులో ప్రధాన సాక్షిగా శర్మ
  • నిన్న ఏసీబీ కోర్టులో వాంగ్మూలం
  • రూ. 40 కోట్లు ఇవ్వజూపారని సాక్ష్యం

బెయిల్‌ నిమిత్తం కోట్ల డీల్‌ కేసులో నిందితుడు, మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి నాగమారుతి శర్మ కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. తనకు బెయిల్ ఇస్తే, రూ. 40 కోట్లను ఇస్తామని నిందితుడు ఆశ్రయించాడని, తనకు వచ్చిన ఆఫర్ ను నిరాకరించానని ఆయన కోర్టులో సాక్ష్యం ఇవ్వడంతో గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసులో పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కన్నట్లయింది. నిన్న స్థానిక ఏసీబీ కోర్టు విచారణకు హాజరైన, నాగమారుతి శర్మ ఈ కేసులో ఏ-4 సాక్షిగా ఉన్న సంగతి తెలిసిందే.

గతంలో ఓబులాపురం మైనింగ్‌ కేసులో జనార్దనరెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసిన వేళ, బెయిల్‌ కోసం సీబీఐ కోర్టు మరో న్యాయమూర్తి, పట్టాభి రామారావుకు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేయగా, దానిపై ఇప్పుడు ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. నాచారం ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ యాదగిరి మధ్యవర్తిగా బేరం సాగగా, నాటి సీబీఐ కోర్టు జడ్జి పట్టాభిరామారావు జనార్దన రెడ్డికి బెయిలు మంజూరు చేశారు. అంతకన్నా ముందు మరో న్యాయమూర్తి, నేటి సాక్షి నాగమారుతి శర్మతోనూ బేరం జరిగింది.

అయితే, నాగమారుతి శర్మ డబ్బులు తీసుకుని బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. మొత్తం ఉదంతం బయటకు పొక్కిన తరువాత, పట్టాభి రామారావుపై కేసు నమోదైంది. అప్పట్లో సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న శర్మను ఏసీబీ అధికారులు నాల్గవ సాక్షిగా చేర్చారు. గాలి జనార్దన రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే, రూ.40 కోట్లు ముట్టజెప్పుతామని తనకు ఆఫర్‌ వచ్చిందని, దాన్ని తాను అంగీకరించలేదని ఏసీబీ కోర్టులో సోమవారం నాడు ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

More Telugu News