Hyderabadi: కుటుంబంతో కలసి వెళ్లి ఐసిస్ లో చేరిన హైదరాబాదీ.. వైమానిక దాడుల్లో దుర్మరణం

  • 2015లో సిరియాకు వెళ్లిపోయిన ఇంజినీర్
  • 2018లో వైమానిక దాడుల్లో దుర్మరణం
  • పునరావాస శిబిరంలో ఉంటున్న భార్య, పిల్లలు

హైదరాబాదుకు చెందిన ఓ ఇంజినీర్ ఐసిస్ ఉగ్రసంస్థలో చేరి దుర్మరణంపాలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే టోలీచౌక్ కు చెందిన ఓ వ్యక్తి ఇంజినీర్ గా పని చేసేవాడు. ఐసిస్ పట్ల ఆకర్షితుడై... ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి అందులో చేరిపోయాడు. 2015లో తన కుటుంబంతో కలసి సెలవులకు సౌదీ అరేబియా వెళ్తున్నట్టు సన్నిహితులకు తెలిపాడు. ముందుగా సౌదీ వెళ్లి అక్కడి నుంచి టర్కీకి చేరుకున్నాడు. అనంతరం తన కుటుంబాన్ని సిరియాకు తీసుకెళ్లాడు.

సిరియాలో ఐసిస్ లో చేరి ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలో సిరియా ప్రభుత్వం జరిపిన వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. 2018లోనే ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది.

వైమానిక దాడుల్లో అతను చనిపోయిన తర్వాత పునరావాస శిబిరంలో అతని భార్య, పిల్లలు తలదాచుకుంటున్నారు. అతి కష్టం మీద ఫోన్ చేసుకునే సదుపాయాన్ని సంపాదించిన అతని భార్య హైదరాబాదులోని బంధువులతో మాట్లాడింది. పునరావాస కేంద్రంలో అష్టకష్టాలు పడుతున్నామని కన్నీటిపర్యంతం అయింది. హైదరాబాదుకు తిరిగి రావడానికి సహకరించాలని విన్నవించింది. మరోవైపు, హైదరాబాద్ నుంచి వెళ్లిపోయేటప్పటికే వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత మరో ఇద్దరు జన్మించారు. మొత్తం నలుగురు పిల్లలతో ఆమె పునరావాస శిబిరంలో ఉంటోంది.

More Telugu News