Arun Jaitly: ఇద్దరం ఒకే సంవత్సరంలో పుట్టాం... ముందే వెళ్లిపోయారు: జైట్లీ మృతిపై సీతారాం ఏచూరి ఆవేదన

  • జైట్లీ మృతిపై సీపీఎం ప్రధాన కార్యదర్శి స్పందన
  • నిర్వేదం వెలిబుచ్చిన ఏచూరి
  • బీజేపీలో అంతటి సమర్థుడు మరొకరు లేరంటూ కితాబు

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తామిద్దరం ఒకే ఏడాది పుట్టామని, కానీ తనను వదిలేసి జైట్లీ ముందే వెళ్లిపోయారంటూ నిర్వేదం వెలిబుచ్చారు. పార్లమెంటులో ఎన్నో సందర్భాల్లో జైట్లీ అర్థవంతమైన చర్చలు జరిపేవారని, బీజేపీలో అంతటి సత్తా ఉన్న నాయకుడ్ని మరొకరిని చూడలేదని ఏచూరి తెలిపారు. జైట్లీ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నానని ఏచూరి గుర్తు చేసుకున్నారు.

సిద్ధాంతాల పరంగా ఇద్దరి మధ్య భావ వైరుధ్యం ఉన్నా, తమ మధ్య చర్చ ఎప్పుడూ పక్కదారి పట్టలేదని వివరించారు. ఓ రకంగా ఇద్దరమూ కలిసే పెరిగాం అని చెప్పుకోవాలని, నేను రాజ్యసభ నుంచి రిటైరైనప్పుడు కూడా జైట్లీ ఇదే మాట చెప్పారని జ్ఞాపకం చేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరంటూ ఎంతో బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు.

More Telugu News