Onion: ఉల్లి ఘాటెక్కుతుండడంతో వినియోగదారుల్లో ఆందోళన : కేజీ రూ.32 పైమాటే

  • గత నెల రోజులుగా ఆకాశయానం
  • మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలతో దెబ్బతిన్న సాగు
  • దిగుబడులు తగ్గిపోవడంతో ధరపై ప్రభావం

మహారాష్ట్రలో ఏకధాటిగా కురిసిన వర్షాలు, వరదలతో అక్కడ భారీగా పండే ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ధరపై ప్రభావం చూపిస్తున్నాయి.  ఓ వైపు కూరగాయల ధరలు గణనీయంగా తగ్గుతుండగా ఉల్లి ధర భారీగా పెరుగుతుండడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. జులైలో కిలో ఉల్లి రూ.20 ఉంటే ఇప్పుడు రూ.32కు చేరింది. వారంలోనే రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగింది. గడచిన నెలరోజుల వ్యవధిలో ఏకంగా 10 నుంచి 14 రూపాయలు ధర పెరగడం మార్కెట్‌ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.

ఉల్లి సాగు అధికంగా ఉండే మహారాష్ట్రలో వర్షాలు, వరదలతో  నిల్వలు దెబ్బతినడంతోపాటు గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గడం ధరలపై ప్రభావం చూపింది. కర్ణాటకలో 2.3 లక్షల ఎకరాల్లో సాగయిన ఉల్లిలో 35 శాతం భారీ వర్షాలు, వరదలతో పాడైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి సాగు 15వేల ఎకరాల వరకు తగ్గింది. వర్షాభావంతో కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల రైతులు ఉల్లి పంట వేయలేదు. ఈ అంశాలన్నీ ఉల్లి ధర పెరిగేందుకు కారణమవుతున్నాయి.

More Telugu News