Andhra Pradesh: అమరావతి రగడపై మరోసారి స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ!

  • రాజధాని వరద వస్తే మునిగిపోతుంది
  • శివరామకృష్ణ కమిటీ నివేదికను టీడీపీ సర్కారు పట్టించుకోలేదు
  • కోడెల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని అంశంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాజధాని ఏ ఒక్కరిదో.. ఏ ఒక్క సామాజికవర్గానిదో కాదని బొత్స స్పష్టం చేశారు. రాజధాని అంశం ఐదు కోట్ల మంది ఆంధ్రులదని వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలో ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంతానికి వరద ముంపు ఉందని బొత్స తెలిపారు.

ఈ విషయంలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 8 లక్షల క్యూసెక్కుల వరద నీటికే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని బొత్స గుర్తుచేశారు. అలాంటప్పుడు 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా బొత్స మండిపడ్డారు. రాజధానిపై పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ అర్థాలను తలపిస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ నేత కోడెల వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బొత్స చెప్పారు.

More Telugu News