ఈ-కేవైసీ నమోదుకాకుంటే రేషన్ సరుకులు ఆగిపోవు.. ప్రజలు ఆందోళన పడొద్దు!: ఏపీ పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్

25-08-2019 Sun 12:41
  • ఆధార్ నమోదుకు తుది గడువు లేదు
  • విద్యార్థులు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు
  • స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ-కేవైసీ ఏర్పాటు చేస్తాం
ఆంధ్రప్రదేశ్ లో ఈ-కేవైసీ(నో యువర్ కస్టమర్) నమోదుపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న వేళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పందించారు. ఆధార్ అప్ డేట్ చేయకుంటే రేషన్ సరుకులు ఆపేస్తారన్న వార్తలో నిజం లేదని శశిధర్ తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆధార్ అనుసంధానం కోసం ఎలాంటి గడువు విధించలేదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో ఈరోజు మీడియాతో కోన శశిధర్ మాట్లాడారు.

ఇక విద్యార్థులు తమ ఆధార్ అప్ డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లోనే ఆధార్ అప్ డేట్ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందుకోసం పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు ప్రభుత్వ బృందాలు వెళతాయని చెప్పారు. ఈ-కేవైసీ చేయనంత మాత్రాన రేషన్ సరుకులు తిరస్కరించబోమని స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కడైతే రేషన్ సరుకులు తీసుకుంటున్నారో అక్కడే ఈ-కేవైసీని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.