Ola driver: బెంగళూరులో హత్యకు గురైన కోల్‌కతా మోడల్.. దారుణంగా చంపేసిన ఓలా డ్రైవర్

  • దోచుకునే ప్రయత్నంలో పొడిచి చంపేసిన డ్రైవర్
  • విమానాశ్రయం సమీపంలో మృతదేహాన్ని పడేసిన వైనం
  • గత నెల 31న ఘటన.. తాజాగా నిందితుడి అరెస్ట్

కోల్‌కతాకు చెందిన 32 ఏళ్ల మోడల్‌/ఈవెంట్ మేనేజర్‌ను బెంగళూరుకు చెందిన ఓలా క్యాబ్ డ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. జులై 31న బెంగళూరులోని కెంపెగౌడ్ అంతర్జాతీయ విమాశ్రయం సమీపంలో ఈ ఘటన జరగ్గా ఈ నెల 21న నిందితుడు హెచ్ఎం నగేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

కోల్‌కతాకు చెందిన పూజా సింగ్ డే (32) ఓ కార్యక్రమం కోసం జులై 30న బెంగళూరు వచ్చింది. తిరిగి కోల్‌కతా వెళ్తున్న సమయంలో క్యాబ్ డ్రైవర్ నగేశ్ చేతిలో హత్యకు గురైంది. విమానాశ్రయంలో పూజ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె హ్యాండ్‌బ్యాగ్ లేకపోవడంతో ఆమె ఎవరన్నది పోలీసులు తొలుత గుర్తించలేకపోయారు. దీంతో ఢిల్లీ, కోల్‌కతా నగరాలకు ప్రత్యేక బృందాలను పంపించి అక్కడ అదృశ్యమైన వారి వివరాలు సేకరించి పూజను గుర్తించారు.

పరప్పణ అగ్రహారలోని కుమారపార్క్ హోటల్ నుంచి పూజ గత నెల 30న సాయంత్రం ఓలా యాప్ ద్వారా క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ఆ తర్వాత కారు డ్రైవర్‌కు ఫోన్ చేసి తర్వాతి రోజు సాయంత్రం 4 గంటలకు హోటల్ వద్దకు రావాలని కోరింది. అనుకున్నట్టే తర్వాతి రోజు ఆమెను కారు ఎక్కించుకున్న డ్రైవర్ నగేశ్ కొంతదూరం వెళ్లాక కారును మరోమార్గంలో పోనిచ్చాడు. డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో జాక్ రాడ్డుతో దాడిచేసి హత్య చేశాడు.

అనంతరం ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను వెతగ్గా అందులో 500 రూపాయలు, రెండు స్మార్ట్‌ఫోన్లు దొరికాయి. వాటిని తీసుకుని పూజ మృతదేహాన్ని కాద యర్రప్పనహళ్లి గ్రామంలో కియా షోరూం వెనక పడేశాడు. అప్పటికీ ఆమె స్పృహలోనే ఉండడంతో కత్తితో పొడిచి, బండరాయితో మోది హత్య చేసి పరారైనట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి జుడీషియల్ కస్టడీ విధించింది.

More Telugu News