Srisailam: గరిష్ఠ స్థాయికి శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం... అన్ని కాలువలకూ నీరు!

  • గణనీయంగా తగ్గిన వరద
  • కర్ణాటకలో కురవని వర్షాలు
  • జూరాలకు లేని వరద ఇన్ ఫ్లో

ఎగువ నుంచి వస్తున్న స్వల్ప వరదతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని నిండుకుండలా మారింది. కర్ణాటకలో వర్షాలు తగ్గిన తరువాత ఆల్మట్టి నుంచి నీటి విడుదలను నిలిపివేయగా, ప్రస్తుతం జూరాలకు 6,226 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది. జూరాల నుంచి 7,187 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర జలాశయం నుంచి విడుదల అవుతున్న నీటితో కలిపి శ్రీశైలానికి 20 వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండగా, ఆ నీరు వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాలకు మాత్రం విడుదల చేస్తూ, జలాశయంలో నిండుగా నీరు ఉండేలా అధికారులు చూస్తున్నారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ల ద్వారా శ్రీశైలం నుంచి నీరు విడుదల అవుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయానికి అధికారులు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద 12 వేల క్యూసెక్కుల నీటిని నికరంగా నిల్వ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

More Telugu News