Arun Jaitly: జైట్లీ మరణంతో ఢిల్లీ క్రికెటర్లు విషాదంలో మునిగిపోవడం వెనుక అసలు కారణం ఇదే!

  • ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీ
  • కోహ్లీ, ధావన్, సెహ్వాగ్, గంభీర్ ల ఎదుగుదలలో జైట్లీ పాత్ర
  • తండ్రిలాంటి వాడని పేర్కొన్న గంభీర్

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి రాజకీయవేత్తలు, ఆర్థిక రంగాల ప్రముఖులు బాధపడడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ, ఢిల్లీకి చెందిన దిగ్గజ క్రికెటర్లు ఆయన మృతి పట్ల విషాదంలో మునిగిపోయారు. అందుకు బలమైన కారణమే ఉంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్ వంటి ప్రస్తుత క్రికెటర్లు, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు భారత జట్టుకు ఆడడంలో జైట్లీ పాత్ర ఎనలేనిది. ఆయన వారికి అందించిన ప్రోత్సాహం అమూల్యమైనది.

అరుణ్ జైట్లీకి ఢిల్లీ క్రికెట్ తో విడదీయరాని అనుబంధం ఉంది. గతంలో అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. క్రికెట్ ను విశేషంగా అభిమానించే జైట్లీ రాజకీయంగా తనపై పడే ఒత్తిళ్ల నుంచి క్రికెట్ కార్యకలాపాల్లో మునిగిపోవడం ద్వారా రిలాక్స్ అయ్యేవారు. అయితే, ఏ పని చేసినా నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో పనిచేసే జైట్లీ అనేక మంది క్రికెటర్ల ఎదుగుదలలో పాలుపంచుకున్నారు.

గౌతమ్ గంభీర్ అంతటివాడు జైట్లీని తండ్రితో సమానం అని పేర్కొన్నాడంటే ఆయన ఢిల్లీ క్రికెటర్లపై వేసిన ముద్ర ఎలాంటిదో స్పష్టమవుతుంది. జాతీయ స్థాయిలో ఢిల్లీ ఆటగాళ్లకు అవకాశాలు పెద్దగా లేని సమయంలో జైట్లీ రాకతో పరిస్థితి మారిపోయిందని సెహ్వాగ్ తెలిపాడు. ప్రతి ఒక్క ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేవారని గుర్తు చేసుకున్నాడు.

More Telugu News