madyapradesh: ప్రభుత్వ సాయం కోసం మహిళ అతి తెలివి తేటలు.. పిండి ముద్దను బిడ్డగా చిత్రీకరించిన వైనం!

  • బొమ్మను తయారుచేసి గుడ్డచుట్టి ఆసుపత్రికి
  • ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ నిధుల కోసం ప్లాన్‌
  • అడ్డంగా బుక్కయిపోవడంతో పరారీ

ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ నిధుల కోసం ఓ మహిళ అతి తెలివితేటలు ఉపయోగించింది. చివరికి అది కాస్తా బెడిసికొట్టడంతో పరారైన ఘటన ఇది. వివరాలలోకి వెళితే, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పేద గర్భిణులు, బాలింతల పోషకావసరాల కోసం 'శ్రామిక్‌ సేవా ప్రసూతి సహాయతా యోజనా' పేరుతో ఓ పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకంలో భాగంగా బాలింతకు పోషకావసరాల కోసం రూ.1400 తక్షణ ఆర్థిక సాయం అందిస్తారు. ఆసుపత్రుల్లో ప్రసవాల రేటును పెంచడానికి ఆసుపత్రిలో ప్రసవించిన వారికి మరో రూ.16 వేలు ఆర్థిక సాయం ప్రోత్సాహం కింద అందిస్తోంది. ఈ డబ్బులకు ఆశపడే సదరు మహిళ అడ్డంగా దొరికిపోయింది.

మొరేనా జిల్లా కైలారాస్‌ ప్రాంతానికి చెందిన మహిళ పిండిముద్దతో బొమ్మను తయారు చేసి ఎరుపురంగు పూసింది. ఆ బొమ్మను ఓ ఎర్రటి వస్త్రంలో చుట్టి ఆసుత్రికి తీసుకువెళ్లింది. తనకు బిడ్డ పుట్టిందని, తన పేరు, తన బిడ్డ పేరు నమోదు చేయాలని స్థానిక ఆశావర్కర్ ను కోరింది. ఆమె వైద్య పరీక్షలు చేసి ఇంజక్షన్ వేయాలి తీసుకురమ్మంటే నిరాకరించింది. దీంతో పరిశీలించగా అసలు విషయం బయటపడి షాకయ్యారు. దీంతో సదరు మహిళ పరారయ్యింది.

దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎస్‌.ఆర్‌.మిశ్రా మాట్లాడుతూ..‘ పరీక్షల నిమిత్తం చిన్నారిని తీసుకురమ్మనప్పుడు ఆమె నిరాకరించింది. బిడ్డను చూడగానే ఎరుపు రంగులో ఉంది. పరీక్షగా చూసిన తర్వాత అసలు పాపే కాదు బొమ్మని తెలిసింది. నా కెరీర్‌లో ఇలాంటి ఘటన అనుభవంలోకి రావడం ఇదే తొలిసారి’ అని తెలిపారు.

More Telugu News