Siddaramaiah: దేవెగౌడ, కుమారస్వామిలపై మండిపడ్డ సిద్ధరామయ్య

  • సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దేవెగౌడ, ఆయన కుమారులే కారణం
  • నా గురించి దేవెగౌడ అసత్యాలు మాట్లాడారు
  • సీఎం పదవికి కుమారస్వామి పేరును నేనే ప్రతిపాదించా

కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య స్నేహం దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య కొనసాగుతున్న విమర్శల యుద్ధం కర్ణాటక రాజకీయాలలో వేడిని పుట్టిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని మాజీ ప్రధాని దేవెగౌడ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ కుటుంబంపై సిద్ధరామయ్య కక్ష కట్టారని ఆయన విమర్శించారు. దేవెగౌడ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు.

సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దేవెగౌడ, ఆయన కుమారులు కుమారస్వామి, రేవణ్ణలే కారణమని సిద్ధరామయ్య ఆరోపించారు. కానీ, ప్రభుత్వం కూలిపోవడానికి కారణం తానేనని ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవెగౌడ అసత్యాలు మాట్లాడారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి పేరును తానే ప్రతిపాదించానని చెప్పారు. జేడీఎస్ తో పొత్తుపై తమ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని... పార్టీ హైకమాండ్ కు కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే చెబుతానని అన్నారు.

'మన దేశంలో ఒక మతతత్వ పార్టీ అధికారంలో ఉంది. విపక్షాలను కేంద్ర ప్రభుత్వం అణగదొక్కేందుకు యత్నిస్తోంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సెక్యులరిజంలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకూడదని భావించాను. కుమారస్వామి సీఎం కావడానికి నేడు అడ్డుపడలేదు' అని సిద్ధరామయ్య చెప్పారు.

More Telugu News