Chandrababu: లబ్దిదారులను ఏరిపారేయాలనే కుతంత్రం కాకపోతే ఎందుకీ నిబంధనలు?: చంద్రబాబు

  • ఈ-కేవైసీ కేంద్రాల వద్ద జనాల అగచాట్లు పడుతున్నారంటూ చంద్రబాబు ఫైర్
  • మరిన్ని కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్
  • ముందుగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటూ హితవు

ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మీసేవా కేంద్రాలు, రేషన్ దుకాణాల వద్ద జనాలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ-కేవైసీ ప్రక్రియ కోసం అర్ధరాత్రి వేళ కూడా మహిళలు, చిన్నపిల్లలు క్యూలో నిలబడి అష్టకష్టాలు పడుతున్నారని ట్వీట్ చేశారు.

తక్కువ కేంద్రాలు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలు ఇంతలా కష్టపడాల్సి వస్తోందని, అయినా పేదవాళ్లకు ఎందుకీ కష్టాలు అంటూ ప్రశ్నించారు. లబ్దిదారులను వీలైనంత మేర ఏరిపారేయాలన్న కుతంత్రం కాకపోతే ఎందుకీ నిబంధనలు అంటూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని అమలు చేయడానికి ముందు దానిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు ఈ సందర్భంగా హితవు పలికారు. సరైన సదుపాయాలు, అవసరమైన సాంకేతికత లేకుండా... ఈ-కేవైసీ నమోదు చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలకు అర్హులు కారంటూ లేనిపోని భయాలను ప్రజల్లో రేకెత్తిస్తోందంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

తక్షణమే ప్రభుత్వం మరిన్ని ఈ-కేవైసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక తన ట్వీట్ చివర్లో వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

More Telugu News