Leeds: పిచ్ పై నిప్పులు చెరగడం అంటే ఏంటో చూపించిన ఆస్ట్రేలియా బౌలర్లు!

  • లీడ్స్ టెస్టులో బౌలర్ల ఆధిపత్యం
  • తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 179 ఆలౌట్  
  • 67 పరుగుల వద్ద ముగిసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్
  • ఆతిథ్య జట్టును వణికించిన కంగారూ పేసర్లు

లీడ్స్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 179 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్ ఆనందం కాసేపట్లోనే ఆవిరైంది. ఆస్ట్రేలియా బౌలర్లు సిసలైన ఫాస్ట్ బౌలింగ్ ప్రదర్శన చేయడంతో ఇంగ్లాండ్ కేవలం 67 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజెల్ వుడ్ 5 వికెట్లతో గడగడలాడించగా, యువ పేసర్లు కమిన్స్ 3, ప్యాటిన్సన్ 2 వికెట్లతో సత్తా చాటారు.

పిచ్ పేస్ బౌలింగ్ కు సహకరిస్తుండడంతో కంగారూలు మరింత రెచ్చిపోయారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ బలహీనతలను గుర్తించి బంతులు విసిరారు. ఆసీస్ ఉచ్చులో సులభంగా పడిపోయిన ఆతిథ్య ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో డెన్లీ (12) ఒక్కడే రెండంకెల స్కోరు సాధించాడు. కెప్టెన్ రూట్ సహా మిగిలినవాళ్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. రూట్ మరీ దారుణంగా సున్నా పరుగులకే వెనుదిరగడంతో ఇంగ్లాండ్ లైనప్ ఆత్మస్థయిర్యం సన్నగిల్లింది.

More Telugu News