Central Minister: సంపద సృష్టించే వాళ్లను ప్రోత్సహిస్తాం: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

  • దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన నిర్మలా సీతారామన్
  • సంస్కరణలు అనేవి నిరంతరం జరుగుతాయి
  • ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం

ఆర్థిక మందగమనం ప్రపంచ వ్యాప్తంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఢిల్లీలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, సంపద సృష్టించే వాళ్లను ప్రోత్సహిస్తామని చెప్పారు. సంస్కరణలు అనేవి నిరంతరం జరుగుతాయని, 2014 నుంచి సంస్కరణలే అజెండాగా పని చేస్తున్నామని, తాము తీసుకొచ్చిన సంస్కరణలతో మన దేశం సురక్షిత స్థితిలో ఉందని అన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో వాణిజ్య, పన్ను విధానాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని, అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గా ఉందని, భారత్ త్వరితంగా వృద్ధిరేటు నమోదు చేస్తోందని అన్నారు.

అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్యయుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై ఉందని, ఈ పరిస్థితి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఆర్థిక పురోగతికి అడ్డంకిగా ఉన్న 16 సెక్షన్లను తొలగించనున్నామని, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఫారిన్ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లపై సర్ చార్జ్ ను తొలగిస్తున్నట్టు చెప్పారు.

ఇకపై రెపో రేటుకు అనుగుణంగానే వడ్డీ, వాహన రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎంఎస్ఎంఈలకు వెసులుబాటు కల్పించేలా ఓటీఎస్, ఎంఎస్ఎంఈల కోసం చెక్ బాక్స్ విధానం, బ్యాంకులకు రూ.70 వేల కోట్లతో ఆర్థిక సర్దుబాటు చేస్తామని, వడ్డీ రేట్ల తగ్గుదలకు కృషి, వడ్డీ రేట్ల తగ్గింపును నేరుగా రుణ గ్రహీతలకు అందించేలా చర్యలు చేపట్టడం వంటి తదితర నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

జీఎస్టీ విధానాన్ని మరింత సులభతరం చేస్తాం

ముఖ్యంగా జీఎస్టీ ఫైలింగ్ లోని ఇబ్బందులను తొలగిస్తామని, ఎల్లుండి జీఎస్టీ అధికారులతో జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జీఎస్టీ విధానాన్ని మరింత సులభతరం చేస్తామని, భద్రతను బలోపేతం చేసే విధానాలు దసరా నుంచి ప్రారంభం కానున్నట్టు చెప్పారు. పన్నుల వసూళ్లలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి కేంద్రీకృత విధానంలో ఆదాయ పన్ను నోటీసులు (ఐటీ నోటీసులు) ఇస్తామని అన్నారు.

More Telugu News