Android: ఆనవాయితీ తప్పిన ఆండ్రాయిడ్... కొత్త వెర్షన్ కు సింపుల్ గా నామకరణం

  • మరికొన్ని వారాల్లో ఆండ్రాయిడ్ నూతన వెర్షన్
  • ఇప్పటివరకు తినుబండారాల పేర్లు పెట్టిన ఆండ్రాయిడ్
  • లేటెస్ట్ వెర్షన్ కు ఆండ్రాయిడ్-10 గా నామకరణం

స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ దిగ్గజం ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ తీసుకువస్తోంది. గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ ఇటీవలే తాజా వెర్షన్ కు మరిన్ని మెరుగులు దిద్ది మరికొన్ని వారాల్లో వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. విశేషం ఏంటంటే, ఇప్పటివరకు ఆండ్రాయిడ్ వెర్షన్లకు చాక్లెట్లు, క్యాండీలు, బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీములకు సంబంధించిన పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సంప్రదాయాన్ని పక్కనబెట్టిన ఆండ్రాయిడ్ తన లేటెస్ట్ వెర్షన్ కు సింపుల్ గా ఆండ్రాయిడ్-10 అంటూ నామకరణం చేసింది. ఈ మేరకు ఆండ్రాయిడ్ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ విభాగం ఉపాధ్యక్షుడు సమీర్ సమత్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

గతంలో ఆండ్రాయిడ్ వెర్షన్లకు డోనట్, జెల్లీ బీన్, కిట్ క్యాట్, లాలీ పాప్, ఐస్ క్రీమ్ శాండ్ విచ్, ఓరియో, ఎక్లెయిర్, జింజర్ బ్రెడ్ అంటూ తినుబండారాల పేర్లు పెట్టారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, అందరికీ అర్థమయ్యేలా సరళంగా ఉండాలన్న ఆలోచనతోనే తాము కొత్త వెర్షన్ కు ఆండ్రాయిడ్-10 గా నామకరణం చేసినట్టు ఆండ్రాయిడ్ వర్గాలు తెలిపాయి.

More Telugu News