India: ఆఫ్ఘన్ ఉగ్రవాదులు కశ్మీర్ లో ప్రవేశించారనడం అందరి దృష్టి మరల్చేందుకే: భారత్ పై పాక్ ప్రధాని విసుర్లు

  • కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేకపోతున్న పాక్
  • మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  • కశ్మీర్ లో భారత్ నరమేధానికి పాల్పడుతోందంటూ ఆరోపణలు

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా పాకిస్థాన్ ఉడికిపోతోంది. తన వాదనకు అంతర్జాతీయ వేదికలపై మద్దతు కొరవడడం కూడా పాక్ ను మరింత రగిలిపోయేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. భారత ఆక్రమిత కశ్మీర్ లో కొందరు, దక్షిణ భారతదేశంలో మరికొందరు ఆఫ్ఘన్ ఉగ్రవాదులు ప్రవేశించారని భారత మీడియాలో వస్తున్న కథనాలను తాము కూడా చూస్తున్నామని తెలిపారు.

భారత ఆక్రమిత కశ్మీర్ లో జాతి నిర్మూలన దిశగా సాగిస్తున్న నరమేధం నుంచి అందరి దృష్టిని మరల్చడానికే ఇలాంటి కథనాలు పుట్టిస్తున్నారని, ఆ విషయం తమకు తెలుసని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. "ఈ విషయంలో అంతర్జాతీయ సమాజాన్ని మరోసారి అప్రమత్తం చేస్తున్నాను. భారత ఆక్రమిత  కశ్మీర్ లోయలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, ఉగ్రవాదాన్ని ఎగదోయడం, వాటి నుంచి అందరి దృష్టి మరల్చడం వంటి చర్యల వెనుక నిలిచేది భారత ప్రభుత్వమే. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి" అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

More Telugu News