Tamil Nadu: తమిళనాడులోకి ముష్కర మూకల చొరబాటు.. నిఘా వర్గాల హెచ్చరికతో రెడ్‌ అలర్ట్‌

  • శ్రీలంక మీదుగా దేశంలోకి చేరిన ఉగ్రవాదులు
  • ముష్కరుల్లో ఒకరు పాకిస్థానీ, ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలు
  • రద్దీ ప్రదేశాలు, ప్రముఖులు, కార్యాలయాలే లక్ష్యం

రద్దీ ప్రదేశాలు, కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించడంతోపాటు ప్రముఖ వ్యక్తులపై దాడులే లక్ష్యంగా పాకిస్థాన్‌ ప్రేరేపిత ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడులోకి చేరినట్లు నిఘావర్గాలు హెచ్చరించడంతో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి మన దేశానికి ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు అఫ్గానిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను పాకిస్థాన్ ఉసిగొల్పనుందని నిఘా సంస్థలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. అందులో భాగంగానే పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తొయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి చొరబడి కోయంబత్తూరులోని రహస్య ప్రదేశంలో నక్కినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

వీరిలో ఒకరు పాకిస్థానీ కాగా, మిగిలిన ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలుగా భావిస్తున్నారు. హిందువుల వేషధారణతో దేశంలోకి చేరి విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను ముమ్మరం చేశారు. కోయంబత్తూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. నగరంలో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. రాజధాని చెన్నైలో బలగాలను పెంచారు. ఎయిర్‌ పోర్టులు, రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌, ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర ప్రాంత జిల్లాలన్నింటికీ హెచ్చరికలు జారీ చేశారు.

More Telugu News