SBI net banking: మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా: అయితే ఈ ఫీచర్‌ గురించి తప్పక తెలుసుకోండి

  • నెట్‌ బ్యాంకింగ్‌కు లాక్‌ అండ్‌ అన్‌లాక్‌ సదుపాయం
  • లాక్‌ చేస్తే పాస్‌వర్డ్‌ తెలిసినా ఆపరేట్‌ చేయలేరు
  • వ్యక్తిగత ఖాతాదారులకు మాత్రమే ఈ సదుపాయం

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీరు ఖాతాదారులా? నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తుంటారా? అయితే బ్యాంక్‌ సరికొత్తగా ఆవిష్కరించిన ఈ ఫీచర్‌ గురించి తప్పక తెలుసుకోండి. నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించే వారి కోసం బ్యాంక్‌ లాక్‌ అండ్‌ అన్‌లాక్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం ద్వారా మీ నెట్‌ బ్యాంక్ ఖాతాను లాక్‌ చేసుకుంటే పొరపాటున ఎవరికైనా పాస్‌వర్డ్‌ తెలిసినా ఖాతా నిర్వహణ సాధ్యంకాదన్నమాట.

వివరాల్లోకి వెళితే...ఇంట్లో కంప్యూటర్‌ ముందు కూర్చుని బ్యాంక్‌ ఖాతాను నిర్వహించుకునే సదుపాయం నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లభిస్తున్న విషయం తెలిసిందే. అయితే పొరపాటు మన యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎవరికైనా తెలిసినా, వాటి చోరీ జరిగినా కొంపకొల్లేరు కావడం ఖాయం. ఈ సమస్య లేకుండా ఖాతాదారులు తమకు నచ్చినప్పుడు నెట్‌బ్యాంకింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఈ లాక్‌ అండ్‌ అన్‌లాక్‌ సదుపాయం అక్కరకు వస్తుంది.

 కాకపోతే ఈ సదుపాయం వ్యక్తిగత ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఖాతాదారులు చేయాల్సింది ఇదే.

  • బ్యాంక్ వెబ్‌సైట్‌ www.onlinesbi.comకు వెళ్లి లాక్ అండ్ అన్‌లాక్ యూజర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • డ్రాప్‌డౌన్ మెనూలో లాక్ యూజర్ యాక్సెస్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, అకౌంట్ నంబర్, క్యాప్చా తదితర వివరాలు ఎంటర్ చేయాలి.
  • కొత్త పాపప్ విండో ఓపెన్ అయి మూడు పాయింట్లు కనిపిస్తాయి. వాటిని చదివి ఓకే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్ అవుతుంది.
  • తిరిగి అకౌంట్‌ను అన్‌లాక్ చేయాలనుకుంటే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి లాక్ అండ్ అన్‌లాక్ యూజర్ ఆప్షన్ ఎంచుకోవాలి. యూజర్ యాక్సెస్ ఆప్షన్ ఎంచుకున్నాక మిగిలిన ప్రాసెస్ అంతా ముందులాగే ఉంటుంది.

More Telugu News