Medak District: పని చేస్తానని లంచం తీసుకుని... కాలేదని తిరిగిస్తూ దొరికిపోయిన తహసీల్దార్!

  • పనిచేసి పెట్టేందుకు రూ.50 వేలు లంచం
  • పనికాలేదని రూ.40 వేలు వెనక్కి పంపిన తహసీల్దార్
  • అవినీతి నిరోధక శాఖకు పట్టించిన బిల్డర్

పని చేసి పెట్టేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న తహసీల్దార్.. అది కాలేదని లంచం సొమ్మును తిరిగి ఇస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. హైదరాబాదు శివారు నిజాంపేట పరిధిలో జరిగిందీ ఘటన. బి.శ్రీనివాసరావు అనే బిల్డర్ గత నెల 31న సర్వేయర్ ద్వారా స్కెచ్ కోసం బాచుపల్లి తహసీల్దార్ యాదగిరిని ఆశ్రయించాడు. స్కెచ్ ఇచ్చేందుకు ఆయన లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో శ్రీనివాసరావు తొలి విడతగా రూ.50 వేలు ఇచ్చాడు.

అయితే, ఎంతకీ పనికాకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా తహసీల్దార్‌పై శ్రీనివాసరావు ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో గత నెల 14న తహసీల్దార్ యాదగిరి తన డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ సయ్యద్ ద్వారా శ్రీనివాసరావుకు రూ.40 వేలు పంపించి.. మిగతా పది వేల రూపాయలను ఖర్చుకింద తీసుకున్నట్టు చెప్పాడు. రూ.10 వేలు తగ్గించి ఇవ్వడంతో తట్టుకోలేపోయిన బిల్డర్.. ఆయనపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

అతడు సమర్పించిన ఆధారాలతో తహసీల్దార్ యాదగిరి, అతడి వ్యక్తిగత డ్రైవర్ అబ్దుల్ సయ్యద్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాదు, గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఆయన స్వస్థలమైన దుబ్బాకలో ఉంటున్న యాదగిరి సోదరి ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు.

More Telugu News