Gold Chain: గోల్డ్ చెయిన్ మింగేసిన దొంగ... పోలీసులకు దివ్యమైన ఐడియా ఇచ్చిన డాక్టర్లు!

  • రాజస్థాన్ లో ఘటన
  • మహిళ మెడలో చెయిన్ కొట్టేసి పోలీసుల రాకతో మింగేసిన చైన్ స్నాచర్
  • డజను అరటిపండ్లు, రెండు బొప్పాయి పండ్లతో గొలుసును బయటికి రాబట్టిన పోలీసులు

రాజస్థాన్ లో ఓ దొంగ బంగారు గొలుసు మింగేయగా, డాక్టర్లు ఇచ్చిన సలహాతో అతి తక్కువ ఖర్చుతో పోలీసులు ఆ గొలుసును రికవరీ చేశారు. దొంగ కడుపులో ఉన్న ఆ గొలుసును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఉపయోగించింది కేవలం డజను అరటిపండ్లు, రెండు బొప్పాయి పండ్లు మాత్రమే. రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో గంగాషహర్ వద్ద ఓ మహిళ మెడలో ఉన్న గోల్డ్ చెయిన్ ను చైన్ స్నాచర్లు ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను కొద్ది వ్యవధిలోనే పట్టుకున్నారు.

అయితే పోలీసుల రాకతో ఆ దొంగ అతి తెలివి ప్రదర్శించి గొలుసు మింగేశాడు. తాను గొలుసు దొంగతనం చేయలేదంటూ బుకాయించాడు. దాంతో ఆ దొంగను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్ రే తీయించడంతో మిలమిలా మెరిసిపోతూ గొలుసు కనిపించింది. కానీ ఆ బంగారు గొలుసును బయటికి తీయడం ఎలా? అంటూ మల్లగుల్లాలు పడుతున్న పోలీసులకు అక్కడి డాక్టర్లు చాలా సింపుల్ ఐడియా ఇచ్చారు.

డజను అరటిపండ్లు, రెండు బొప్పాయి కాయలు తెప్పించి, ఆ దొంగతో తినిపించాలని చెప్పారు. ఆ పండ్లు తినేందుకు దొంగ మొండికేయగా, బలవంతంగా అన్నింటిని అతడి నోటిలో కుక్కారు. ఇంకేముంది, బాగా మగ్గిన పండ్లు వాటిపని అవి చేసేశాయి. ఆ మరునాటి ఉదయం బంగారు గొలుసు బయటికి వచ్చేసింది.

More Telugu News