central minister: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన సుజనా చౌదరి

  • ‘పోలవరం’పై లోతుగా చర్చించాలి
  • ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రజల్లో గందరగోళం నెలకొంది
  • హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి

‘పోలవరం’పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రివర్స్ టెండరింగ్ ను రద్దు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు వెలువడటం హర్షణీయమని, ప్రభుత్వ వైఖరి సరికాదని ఈ తీర్పు ద్వారా వెల్లడైందని అన్నారు. పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి వంటిదని, ఈ తీర్పుతో నైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని, తొందరపాటు నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయాన్ని సీఎం జగన్ గ్రహించాలని సూచించారు.

జపాన్ ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వ చర్యలు అభివృద్ధికి దోహదపడవని తన లేఖలో రాసిందని, ఈ సూచనలను పెడచెవిన పెట్టారని విమర్శించారు. వ్యక్తిగత పంతాలకు పోకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కోరారు.

కాగా, ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను సుజనా చౌదరి ఈరోజు కలిశారు. పోలవరం ప్రాజెక్టుపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై ఏపీ ప్రజల్లో గందరగోళం నెలకొందని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది

More Telugu News