Amazon: ఇక భారత్ లోనూ 'అమెజాన్ ఫ్రెష్'... ఆన్ లైన్ లో కూరగాయల అంగడి!

  • ఆన్ లైన్ లో తాజా కూరగాయలు, పండ్లు, మాంసం
  • రెండు గంటల్లోనే డెలివరీ
  • బెంగళూరు నుంచి సేవలు మొదలు

అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇప్పుడు తన నిత్యావసరాల ఆన్ లైన్ దుకాణం 'అమెజాన్ ఫ్రెష్' ను కూడా భారత్ కు తీసుకువచ్చింది. తాజా కూరగాయలు, ఫలాలు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, ఐస్ క్రీములు, ఎండబెట్టిన ఆహార పదార్థాలను 'అమెజాన్ ఫ్రెష్' ద్వారా అందించనున్నారు. ఆర్డర్ చేసిన రెండు గంటల్లోనే డెలివరీ ఇచ్చేలా అమెజాన్ ఏర్పాట్లు చేస్తోంది. వాల్ మార్ట్ గూటికి చేరిన ఫ్లిప్ కార్ట్ కూడా ఆన్ లైన్ లో నిత్యావసరాల అమ్మకాలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.

'అమెజాన్ ఫ్రెష్' ఆన్ లైన్ దుకాణం 2007లో సియాటిల్ లో ప్రారంభమైంది. 'అమెజాన్ ఫ్రెష్' ద్వారా సేవలు అందుకోవాలంటే అమెజాన్ భారత వెబ్ సైట్ నుంచి గానీ, యాప్ నుంచి గానీ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 'అమెజాన్ ఫ్రెష్' ద్వారా 5,000 రకాల తాజా కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తులు ఎంపిక చేసుకోవచ్చని అమెజాన్ వర్గాలు చెబుతున్నాయి. పర్సనల్ కేర్, హోమ్ కేర్ ఉపకరణాలు కూడా 'అమెజాన్ ఫ్రెష్' లో అందుబాటులో ఉంటాయి. మొదట బెంగళూరులో ప్రారంభం కానున్న ఈ సేవలను త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.

More Telugu News