నీరవ్ మోదీకి సెప్టెంబరు 19 వరకు జ్యుడిషియల్ కస్టడీ

22-08-2019 Thu 16:22
  • వేల కోట్ల మేర బ్యాంకుకు టోకరా ఇచ్చిన నీరవ్
  • మార్చిలో లండన్ పోలీసులకు పట్టుబడిన వైనం
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ)ను వేల కోట్ల మేర మోసగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీకి తాజాగా సెప్టెంబరు 19 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో నేడు విచారణ జరగ్గా, నీరవ్ మోదీ రిమాండ్ ను మరికొన్ని రోజులు పొడిగించారు. ప్రస్తుతం నీరవ్ వాండ్స్ వర్త్ జైల్లో ఉండగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. ఈ వజ్రాల వ్యాపారిపై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. కేసులకు భయపడి లండన్ పారిపోయిన నీరవ్ ను ఐదు నెలల క్రితం లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికి పలుమార్లు బెయిల్ దరఖాస్తు చేసుకున్న నీరవ్ కు ప్రతిసారీ నిరాశే ఎదురైంది.