Congress: చిదంబరాన్ని సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందో అర్థం కావట్లేదు!: కపిల్ సిబాల్

  • ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చిదంబరం
  • కొనసాగుతున్న ఇరుపక్షాల వాదనలు
  • చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇవ్వొద్దు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ అధికారులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిదంబరంను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు ఆయన్ని హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. రిమాండ్ ప్రతిని న్యాయమూర్తికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించారు.  

చిదంబరానికి బెయిల్ కోరుతూ ఆయన తరపున న్యాయవాదులు కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు. చిదంబరాన్ని సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందో అర్థం కావడం లేదని, ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకూ న్యాయస్థానం ముందు ఆయన్ని ఎందుకు హాజరుపరచలేదని సిబాల్ ప్రశ్నించారు. ఐఎన్ఎక్స్ కు విదేశీ పెట్టుబడులు అనుమతి ఇచ్చిన బోర్డులో ఆరుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారని, ఇందులో ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని, పదేళ్ల తర్వాత ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని న్యాయస్థానానికి సిబాల్ తెలిపారు. సీబీఐ విచారణకు చిదంబరం ఎప్పుడూ గైర్హాజరు కాలేదని, ఈ కేసులో ఏదో జరిగిందని సీబీఐ అన్నంత మాత్రాన అది నిజం కాదని అన్నారు.

 నిన్న రాత్రి చిదంబరాన్ని అరెస్టు చేసిన తర్వాత నుంచి ఈరోజు ఉదయం వరకు ఆయన్ని సీబీఐ ఎలాంటి విచారణ జరపలేదని, ఉదయం 11 గంటల నుంచి 12 ప్రశ్నలు సంధించారని న్యాయస్థానానికి సిబాల్ తెలిపారు. ఈ 12 ప్రశ్నల్లో ఆరు ప్రశ్నలకు గతంలోనే చిదంబరం సమాధానమిచ్చారని, ఇప్పుడు కూడా ఆయన అదే సమాచారం చెప్పారని అన్నారు. ఒకవేళ చిదంబరం ముడుపులు తీసుకుని ఉంటే వాటిని ఎక్కడో ఒక చోటకు పంపాలి కదా! ఆ ముడుపులను ఎక్కడికి పంపారో సీబీఐను చెప్పమనండి అని న్యాయస్థానాన్ని కోరారు. ముడుపులు ఇచ్చినట్టు పేర్కొన్న ప్రధాన నిందితుల డైరీలను ఒకసారి పరిశీలించాలని, ముడుపులు ఎంత ఉన్నాయో చెప్పమని అడగాలని కోర్టుకు విన్నవించారు. చిదంబరంను సీబీఐ కస్టడీకి ఇవ్వొద్దని కోరారు.

ఏ ఒక్క ప్రశ్నకూ చిదంబరం సమాధానం చెప్పడం లేదు: తుషార్ మెహతా

ఈ కేసు విచారణకు చిదంబరం సహకరించలేదని, దర్యాప్తు అధికారి ప్రశ్నలకు బదులివ్వలేదని తుషార్ మెహతా న్యాయస్థానానికి చెప్పారు. చిదంబరాన్ని అరెస్టు చేసిన ఇరవై నాలుగు గంటల్లోపే కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. ఈ కేసు విచారణ నిమిత్తం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ చిదంబరం సమాధానం చెప్పడం లేదు కనుక, కనీసం ఆయన్ని ఐదు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచాలని సీబీఐ తరపు న్యాయవాది తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు.

More Telugu News