ISRO: ఇస్రోలో మహిళలు, పురుషులు అనే తేడా ఉండదు: ఇస్రో చైర్మన్ శివన్

  • ఇస్రోలో లింగ సమానత్వంపై మీడియా ప్రశ్న
  • ప్రతిభకే పెద్దపీట వేస్తామని చెప్పిన ఇస్రో చైర్మన్
  • త్వరలో చంద్రయాన్-3 ఉంటుందని వెల్లడి

చంద్రయాన్-2తో భారత కీర్తిపతాకను ప్రపంచస్థాయిలో రెపరెపలాడించిన ఇస్రో చైర్మన్ కె.శివన్ లింగ సమానత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు జవాబిస్తూ, ఇస్రోలో ప్రతిభకే పెద్దపీట వేస్తామని, వారు పురుషులా, స్త్రీలా అనేది పట్టించుకోమని స్పష్టం చేశారు. ఇస్రోలో మహిళలు, పురుషులు అనే భేదభావం లేదని, వారి పనితనమే కొలమానం అని వెల్లడించారు.

చంద్రయాన్-2 ప్రాజక్టు డైరక్టర్ గా ఎం.వనిత వ్యవహరించగా, రీతూ కరిధాల్ మిషన్ డైరక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించడం తెలిసిందే. ఇంకా పలు దశల్లో కొందరు మహిళా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కూడా పాలుపంచుకున్నారు. ఇక, భవిష్యత్ ప్రణాళికలపైనా శివన్ స్పందించారు. చంద్రయాన్-3కి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. చంద్రయాన్-2ని అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా పరిశీలిస్తోందని తెలిపారు.

More Telugu News