E-Tractor: సీఎస్ఐఆర్, సీఎంఈఆర్ఐ సృష్టి... రూ. 1 లక్షకే 10 హార్స్ పవర్ ఈ-ట్రాక్టర్!

  • పశ్చిమ బెంగాల్ లో సిద్ధమవుతున్న ట్రాక్టర్
  • మరో ఏడాదిలో ట్రయల్ రన్
  • వెల్లడించిన సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ డైరెక్టర్ హరీశ్ హిరానీ

ఇండియాలో ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలు ప్రభుత్వ సహకారంతో మరో అద్భుత సృష్టి చేస్తున్నారు. కేవలం రూ. ఒక లక్ష రూపాయల రేంజ్ లో 10 హార్స్ పవర్ శక్తితో బ్యాటరీ సాయంతో పనిచేసే ట్రాక్టర్ ను సృష్టిస్తున్నారు. ప్రభుత్వ రంగ సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ (సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఈ ట్రాక్టర్ ను పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో తయారు చేస్తుండగా, మరో ఏడాది వ్యవధిలో ఈ ట్రాక్టర్ ట్రయల్ రన్ జరుగుతుందని తెలుస్తోంది.

తక్కువ బరువుతో ఉండేలా ట్రాక్టర్ ను రూపొందిస్తున్నామని, కొద్దిమొత్తంలో భూమి ఉండే రైతులకు ఉపయుక్తకరంగా ఉండేలా దీన్ని తయారు చేస్తున్నామని సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ డైరెక్టర్ హరీశ్ హిరానీ మీడియాకు వెల్లడించారు. ఈ ట్రాక్టర్ లో లీథియం అయాన్ బ్యాటరీని వినియోగించామని, ప్రస్తుతం బ్యాటరీ శక్తిని పరిశీలిస్తున్నామని, ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే గంటపాటు ట్రాక్టర్ ను నడపవచ్చని ఆయన అన్నారు. ట్రాక్టర్ తయారీకి అవసరమైన సాంకేతికతను అందిస్తున్న కంపెనీలకు కొంత మొత్తాన్ని ఇవ్వాల్సి వుండటంతో, ట్రాక్టర్ ధర లక్ష రూపాయల కన్నా కాస్తంత ఎక్కువగా ఉంటుందని హరీశ్ హిరానీ అన్నారు.

ఈ ట్రాక్టర్లకు చార్జింగ్ పెట్టుకునేందుకు వ్యవసాయ భూమిలోనే సోలార్ చార్జింగ్ స్టేషన్లను కూడా తయారు చేసి అందిస్తామని, దీనివల్ల రైతుల పనికి ఆటంకాలు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ట్రాక్టర్ కు అదనపు బ్యాటరీని ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు.

కాగా, ఇండియాలో అధికంగా అమ్ముడయ్యే స్వరాజ్, సోనాలికా బ్రాండ్ ట్రాక్టర్లను సీఎంఈఆర్ఐ అభివృద్ధి చేసింది. స్వరాజ్ బ్రాండ్ ను మహీంద్రా అండ్ మహీంద్రా, సోనాలికాను ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తున్నాయి.

More Telugu News