Rajive Gouba: కేంద్ర కేబినెట్ సెక్రటరీగా రాజీవ్ గౌబాకు పదోన్నతి

  •  కేంద్ర కేబినెట్ సెక్రటరీగా రాజీవ్ గౌబా
  • 1982 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్
  • జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టం రూపకల్పనలో కీలక పాత్ర

జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర కేబినెట్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) రాజీవ్ గౌబాకు పదోన్నతి లభించింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీగా ఆయన్ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జార్ఖండ్ కేడర్‌కు చెందిన రాజీవ్, 1982కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుత సెక్రటరీ పీకే సిన్హా పదవీకాలం ముగుస్తుండటంతో, క్యాబినెట్ నియామకాల కమిటీ రాజీవ్‌ను ఎంపిక చేసింది. ఈ నెల 30న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లు ఆ పదవిలో ఉంటారు.

పంజాబ్‌లో పుట్టిన రాజీవ్, కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో వివిధ హోదాల్లో పని చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా, హోమ్ శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేసిన ఆయన, 2017లో కేంద్ర కేబినెట్‌కు వచ్చే ముందు జార్ఖండ్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టం రూపకల్పనల్లో పాలుపంచుకున్నారు. అంతర్గత భద్రత, తీవ్రవాదం, జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం అదుపు, వామపక్ష తీవ్రవాదం నిర్మూలన తదితర అంశాల్లో రాజీవ్ గౌబాకు మంచి పేరుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) బోర్డులో భారత్ తరఫున నాలుగేళ్లు పనిచేశారు. పలు అంతర్జాతీయ సంస్థల్లోనూ విధులు నిర్వహించారు.

More Telugu News