Congress: చిదంబరం అరెస్టుకు ప్రయత్నాలు ముమ్మరం.. ఘాటుగా స్పందించిన డీఎంకే అధినేత స్టాలిన్!

  • రాజకీయ కక్షతోనే ఇలాంటి చర్యలు
  • చిదంబరం మంచి న్యాయ నిపుణుడు
  • ఆయన ఈ సమస్యను లీగల్ గానే ఎదుర్కొంటారు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విచారణ సంస్థలు సీబీఐ, ఈడీ వ్యవహరిస్తున్న తీరుపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ కక్షతోనే చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు.

చిదంబరం న్యాయ నిపుణుడనీ, ఆయన ఈ సమస్యను చట్టపరంగా ఎదుర్కోగలరని వ్యాఖ్యానించారు. కేంద్రం వైఖరిని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇక జమ్మూకశ్మీర్ లో నేతలను విడుదల చేయాలని కోరుతూ డీఎంకే సభ్యులు రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపడతారని స్టాలిన్ వెల్లడించారు. తమ సభ్యులకు పార్టీ నేత టీఆర్ బాలు నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 14 రాజకీయ పార్టీలు పాల్గొంటాయని పేర్కొన్నారు.

More Telugu News