Chhota Rajan: గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు ఎనిమిదేళ్ల జైలు శిక్షను విధించిన సీబీఐ కోర్టు

  • 2012లో బీఆర్ శెట్టిపై హత్యాయత్నం చేసిన చోటా రాజన్ గ్యాంగ్
  • జర్నలిస్టు హత్య కేసులో గత ఏడాది చోటా రాజన్ కు జీవితకాల శిక్ష విధింపు
  • నకిలీ పాస్ పోర్టు కేసులో కూడా శిక్షను అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్

2012లో చోటు చేసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త, హోటల్ యజమాని బీఆర్ శెట్టి హత్యాయత్నం కేసులో గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్షను విధించింది. అంతేకాదు, ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి  ఒక్కొక్కరికి రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ సందర్భంగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరాత్ మాట్లాడుతూ, హోటల్ యజమానులు, భవన నిర్మాణదారులలో భయాందోళనలను పెంచేందుకు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఒక పక్కా ప్రణాళికతో చోట్ రాజన్ గ్యాంగ్ ఈ ఘటనకు పాల్పడిందని చెప్పారు.

ఈ కేసులో షార్ప్ షూటర్ రోహిత్ తంగప్ప, నిత్యానంద్ నాయక్, సెల్విన్ డేనియల్, దిలీప్ ఉపాధ్యాయ్, తల్విందర్ సింగ్ భక్షి, గురుదీప్ సింగ్ నిందితులుగా ఉన్నారు. గురుదీప్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.

జర్నలిస్టు జె.డేను హత్య చేసిన కేసులో చోటా రాజన్ కు గత ఏడాది జీవితకాల శిక్ష పడింది. ఇదే కేసులో రోహిత్ తంగప్పకు కూడా యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. నకిలీ పాస్ పోర్టు కేసులో కూడా చోటా రాజన్ శిక్షను అనుభవిస్తున్నాడు.

More Telugu News